మురళీ స్వరాలు
(Andhra Jyothi dt07.01.2013)
'ఇంటింటా అన్నమయ్య' అందరికీ తెలుసు, మరి 'ఇంటింటా త్యాగయ్య' విన్నారా? అన్నమయ్య కన్నా ముందువాడైన వాగ్గేయకారుడు కృష్ణమయ్య గురించి విన్నారా? వాటి గురించి తాను తెలుసుకొని, పదిమందికీ తెలియజెప్పాలని తపన పడుతున్న విశాఖపట్నం వాసి మ్యూజికాలజిస్ట్ వినుకొండ మురళీకృష్ణ - హాలీవుడ్ గీతాలకూ మన రాగాల్లోనే స్వరకల్పన చేయగల ప్రతిభాశాలి. అవకాశం వస్తే మొట్టమొదటిసారే జాతీయ అవార్డును అందుకోగలనన్న నమ్మకంతో ఉన్న ఆయన చేపట్టిన ముఖ్యమైన మూడు ప్రాజెక్టుల వివరాలు ఆయన మాటల్లోనే...
వచనాల వైభవం
"కాలపరంగా అన్నమయ్య కన్నా ముందువాడైన సంకీర్తనాచార్యుడు శ్రీకాంత కృష్ణమాచార్యులు ఇప్పటికీ వెలుగులోకి రాకపోవడం శోచనీయం. కృష్ణమయ్య 12- 13 శతాబ్దాల్లో సింహాచలనాథుణ్ని స్తుతిస్తూ దాదాపు 4 లక్షల వచనాలు రాసిన వ్యక్తి. ఆయన వచన వైభవానికి సాక్షాత్తూ ఆ స్వామే తన్మయుడై, గజ్జె కట్టి ఆడేవాడని చరిత్ర చెబుతోంది.కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉన్నప్పుడు ఆయన గానం చేస్తే కనకవర్షం కురిసిందని ఆ రాజచరిత్ర చెబుతోంది.
అక్కడ సింహగిరి వచనాలను రాగిరేకుల మీద రాయించిన ఆనవాళ్లున్నాయి. అందువల్ల పరిశోధిస్తే ఆ చుట్టుపక్కలగానీ, కృష్ణమయ్య మేనమామల ఊరైన శ్రీరంగం పరిసరాల్లో గానీ మనకు ఆ పెన్నిధి దొరకవచ్చు. కొన్ని మాత్రం ఫ్రాన్సులోని 'కింగ్స్ లైబ్రరీ'లో ఉన్నాయని నాకు ఆనందగజపతిరాజుగారు చెప్పారు. ఎంతో శ్రమించిన తర్వాత ఆ వచనాల్లో దాదాపు రెండు వందలు మనకు లభించాయి. అయితే కీర్తనల వలె అవి పాడుకోవడానికి అనువుగా లేవు.
ఒకసారి విన్నంతనే గుర్తుండవు. అందువల్ల వాటిని కీర్తనల రూపంలోనికి కొద్దిగా మార్చి స్వరపరచి గానం చేసి రికార్డు చేశాను. ఈలోగా సింహాచలం దేవస్థానం వారు అవి వాళ్ల సొత్తని, ఎవరూ వాటి ని పాడకూడదని వాదన లేవదీశారు. నేను ఢిల్లీ వరకూ వెళ్లి కాపీరైటు సంపాదించుకున్నాను. అలాగని నేనేమీ నా స్వార్థం కోసం చెయ్యడం లేదు. ప్రజల నోళ్లలో నానందే కీర్తనలకు ప్రాచుర్యం ఎలా కలుగుతుంది? మన వాగ్గేయకారుల వైభవం భావి తరాలకు ఎలా తెలుస్తుంది? దానికోసమే నా తపన తప్ప, వేరే స్వార్థం ఏమీ లేదు.''
ఇంటింటా త్యాగరాజు
"ఎందరో పరిశోధక పండితుల కృషి ఫలితంగా అన్నమయ్య కీర్తనలు ఇవాళ ఇంటింటా వినిపిస్తున్నాయి. ఆబాలగోపాలమూ వాటిని తమవిగా చేసుకుని పాడుకుంటున్నారు. మరి కర్ణాటక సంగీతానికి ఆద్యుడైన త్యాగయ్య గళసీమ రాజిల్లిన అమృత గానాలు మాత్రం కచేరీల్లోనూ, విద్వాంసుల గాత్రాల్లోనూ తప్ప సామాన్యుల నోట పలకడం లేదెందుకు? ఉపనిషత్తుల సారాన్నంతటినీ తమలో ఇముడ్చుకున్న ఆ కీర్తనలు అందరికీ చేరువ కావాలన్న ఆశయంతో నేను ఐదేళ్ల క్రితమే 'ఇంటింటా త్యాగరాజు' ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాను. ఆ కీర్తనల్లోని గమకాలు, కానిచోట విరుపులనూ పరిహరించి అన్నమయ్య కీర్తనల వలెనే సులువుగా పాడుకోగలిగేలా, వినగానే అర్థం చేసుకుని ఆస్వాదించగలిగేలా మార్చాను. అలాగని వాటి రాగతాళాలను మార్చేసి వెర్రిపోకడలేం పోలేదు. శ్రీరామ సాక్షాత్కారం పొందిన త్యాగయ్య ఆత్మను ఆవాహన చేసుకుని భావయుక్తంగా, చెవికింపుగా ఉండేలా స్వరపరిచిన వంద కీర్తనలు ఇప్పుడు నాదగ్గరున్నాయి. మచ్చుకు కొన్ని యూట్యూబ్‌లోనూ పెట్టాను. మరికొన్నిటిని బ్లాగ్ ద్వారా నెటిజనులకు పరిచయం చేశాను.
అక్కడి పాటలు మన రాగాల్లో...
ఇప్పటికీ టీవీ ఛానెళ్లలో, రియాలిటీ షోల్లో వినిపిస్తున్నవి, అందరినీ ఆకట్టుకుంటున్నవి 50, 60ల నాటి పాటలే. ఏదో ఒక రాగాన్ని ఆధారంగా చేసుకుని స్వరపరచిన పాటలు గనుక అవి కాలపరీక్షను తట్టుకొని నేటికీ నిలబడ్డాయి. పాశ్చాత్య ధోరణులతో ప్రభావితమైపోయి మనదైన సంపదను వదిలేసిన వాళ్లే ఇవాళున్న సంగీత దర్శకులందరూ. హృదయమూ మేథా కలిసి స్వరరచన చేసిన చిట్టచివరి సంగీతకర్త ఇళయరాజానే. మాధుర్య ప్రధానమైన మన సంగీతంలో ఒదగనిదేమీ లేదు. నాకేగనుక అవకాశం వస్తే నేను మొట్టమొదటి ప్రయత్నంలోనే జాతీయ అవార్డును సంపాదించగలనని నా నమ్మకం. ప్రపంచ ఆదరణ పొందిన కొన్ని హాలీవుడ్ హిట్ గీతాలకు నేను మన స్వరాలను ఉపయోగించి కట్టిన ట్యూన్లు వింటే - నా నమ్మకంలోని బలమెంతో మీకు తెలుస్తుంది.''
పెద్దలు పూనుకుంటేనే పని
"మాది వినుకొండ వాగ్గేయకారుల వంశం. అక్కన్న మాదన్న సమయంలో మా పూర్వీకులు కళింగాంధ్రలోని బరంపురానికి వచ్చి స్థిరపడ్డారు. నేను పుట్టి పెరిగిందంతా అక్కడే. మా తాతగారు అంబటిపూడి సింహాచలంగారు మంచి సంగీతాభిమాని. పెద్దపెద్ద విద్వాంసులను ఆహ్వానించి మా ఊళ్లో కచేరీలు చేయించేవారు. మద్రాసు నుంచి ఒక ఉపాధ్యాయుణ్ని రప్పించి మరీ మా అమ్మకు శాస్త్రీయ సంగీత పాఠాలు చెప్పించారాయన. అలా నాకు చిన్నప్పటి నుంచే సంగీతమంటే ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. అయితే ఎందుకనో చాలా ఏళ్ల వరకూ నాకు పద్ధతిగా దాన్ని అభ్యసించే అవకాశం కలగలేదు. ఈలోగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం, కుటుంబం - అన్నీ ఏర్పడ్డాయి.
ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన రాయగడ (నేటి ఒడిశా) వంటి చోట్ల ఉద్యోగం చేస్తూనే మిత్రులను కూడగట్టి సంగీత సాహిత్య సాంస్కృతిక సంస్థలను స్థాపించి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ నాలోని అభిరుచికి సానపెట్టుకున్నాను. మా అమ్మాయికి మాత్రం చిన్నవయసు నుంచే సంగీతాన్ని నేర్పించాలని పట్టుదలతో విజయనగరం, అటుపై విశాఖపట్నాలకు మకాం మార్చాను. మా అమ్మాయితో పాటు నేనూ విద్యార్థిగా పాఠాలు నేర్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి.
దానితర్వాత ఒక దినపత్రికలో సాంస్కృతిక విలేఖరిగా అవకాశం రావడంతో సంగీతంపై పట్టుపెరిగింది. దానిలో ప్రతి వారం ఒక రాగాన్ని, అందులో స్వరపరచిన సంప్రదాయ కీర్తనలు, తెలుగు - హిందీ సినిమా పాటలు, లలిత సంగీత గేయాలు... వీటన్నిటీ పాఠకులకు పరిచయం చేసే ఫీచర్ 'రాగరంజని'ని నిర్వహించాను. అమ్మాయి సంగీతాభ్యాసం కోసం చెన్నై వెళ్లడంతో నాకు సాలూరి రాజేశ్వర్‌రావు, సామవేదం షణ్ముఖశర్మ వంటి వారి స్నేహం లభించింది. షణ్ముఖశర్మ రాసిన 'శివపదం' స్వరపర స్తున్నప్పుడు కె.విశ్వనాథ్‌గారి పరిచయం కలిగింది. సందర్భం, పాటను బట్టి దేన్నెలా స్వరపరచాలన్న కిటుకులు నాకు నేర్పిందాయనే.
తర్వాత నేను స్వరపరచిన ఆదిశంకరుల స్తోత్రాలు కొన్నిటిని ఎస్పీబాలసుబ్రమణ్యం, యేసుదాస్ పాడగా 'శివమ్' సీడీలుగా విడుదల చేశాం. వాటి తర్వాత నేను తలపెట్టిన మూడు ప్రాజెక్టుల కోసం పూర్తి సమయాన్ని వెచ్చించాలన్న సంకల్పంతో నాలుగేళ్ల క్రితం నేను స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశాను. ప్రతిదాన్నీ సంసిద్ధంగా ఉంచానుగానీ, ప్రజలకు చేరువగా తీసుకెళ్లడానికి అవసరమైన ఆర్థికవనరులు లేవు నాకు. మన సంగీతం పట్ల ఆసక్తి, దాన్ని భావితరాలకు అందించాలన్న అనురక్తి ఉన్నవారు పూనుకుంటే ఈ నిధి అందరికీ అందుతుందనే నమ్మకం ఉంది.'' వినుకొండ మురళీకృష్ణ ఫోన్ : 9248468774
అరుణ పప్పు, విశాఖపట్నం
ఫోటోలు : వై. రామకృష్ణ